: అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం: పవన్ కల్యాణ్
అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యమని ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాదులో జనసేన కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఫుడ్ పార్క్ సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి జనసేన పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం చేసే అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలేగానీ, భయంతో బతకకూడదని పేర్కొన్నారు. కాగా, పవన్ ను కలిసిన ఫుడ్ పార్క్ బాధితులు ఈ మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని తెలిపారు. 30 గ్రామాల ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో తమకు తెలియడం లేదని, మీరే సాయం చేయాలని వారు పవన్ కల్యాణ్ ను కోరారు.