: వాహనదారుల ప్రాణాలు తీయడంలో ముందున్న బుధవారం!


రహదారులపై మోటార్ సైక్లిస్టుల ప్రాణాలు అధికంగా ఎప్పుడు పోతాయి? వీకెండ్ జోరులోనో లేదా విపరీతమైన పనిఒత్తిడి వుండే సోమవారమో కాదు. అందుబాటులోని గణాంకాల మేరకు డల్లుగా ఉండే బుధవారం రోజున వాహనాల యాక్సిడెంట్లు అధికంగా జరుగుతున్నాయి. బెంగళూరు రహదారులపై జరిగిన వాహన ప్రమాదాలను పరిశీలిస్తే, మిగతా రోజుల కన్నా బుధవారం నాడు అధిక ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. 2014 ప్రారంభం నుంచి ఈ సంవత్సరం జూలై వరకూ బుధవారం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతుండగా, ట్రాఫిక్ పోలీసు వర్గాలు 'బుధవారం భయం'ను తోసిపుచ్చుతున్నాయి. ఇది కేవలం కాకతాళీయం కావచ్చని, ఇప్పటివరకూ రోడ్ల ప్రమాదాలపై ఇటువంటి అంచనాలకు శాస్త్రీయత లేదని బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ ఆర్.హితేంద్ర వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇదే రకమైన గణాంకాలు ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బుధ, గురువారాల్లో గరిష్ఠ సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తుంటాయని, దీని వల్ల కూడా ప్రమాదాల సంఖ్య అధికంగా ఉండవచ్చని ట్రాఫిక్ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని విభేదిస్తున్నవారూ ఉన్నారు. అధిక వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే, ట్రాఫిక్ నిదానంగా కదులుతూ, ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని మరికొందరు అంటున్నారు. ఇక నాలుగైదేళ్ల క్రితం లేని 'వీక్ డేస్ పార్టీయింగ్' మెట్రో నగరాలను ఊపుతోందని ఇటీవల తయారైన ఓ డాక్యుమెంటరీ వెల్లడిస్తోంది. గతంలో శుక్రవారం రాత్రి నుంచి పబ్ కల్చర్ ప్రారంభమవుతుండగా, ఇప్పుడు బుధ, గురువారాలు సైతం యువత పబ్బులను వదలడం లేదన్నది ఈ డాక్యుమెంటరీ సారాంశం. అది కూడా బుధవారం ప్రమాదాలు పెరిగేందుకు ఓ కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరాల రహదారులపై తెల్లవారుఝాము ప్రమాదాలు అధిక సంఖ్యలో ఉంటుండగా, ఆపై సాయంత్రం 6 నుంచి రాత్రి 9 మధ్య జరుగుతున్న ప్రమాదాలు అధికంగా ఉన్నట్టు నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ముఖ్య గణాంకాల అధికారి రంజన్ ముఖర్జీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News