: కప్పు టీ కోసం 11 గంటలు కష్టపడ్డాడు.. ఇది మరి 'హైటెక్' టీ!
రొటీన్‌కి భిన్నంగా టీ పెట్టాలని ప్రయత్నించి సరిగ్గా 11 గంటలు కష్టపడి ఎట్టకేలకు విజయం సాధించాడు ఓ టెక్కీ. మామూలుగా టీ పెట్టుకోవడం అంటే, స్టౌపై గిన్నెలో నీరుపోసి టీ పొడి వేసి, బాగా కాచి, తర్వాత పాలు పోసి తేనీరు తయారు చేస్తారు. అయితే, లండన్ హోవ్‌లో నివసించే డేటా స్పెషలిస్టు మార్క్ రిట్‌మన్ మాత్రం ఒక కప్పు టీ తయారు చేసుకోవడానికి ఆయన నీళ్లను మామూలుగా వేడి చేయలేదు. తన హైటెక్ కెటిల్‌ను వినియోగించాడు. వై-ఫై ద్వారా కెటిల్‌కు సిగ్నల్ పంపి నీటిని వేడిచేసి టీ తయారుచేయాలని ప్రయత్నించాడు. చెప్పే మాటలనే కమాండ్లుగా తీసుకుని పని చేసే విధంగా అన్నింటినీ రూపొందించుకొని రిట్‌మన్ టీ పెట్టడాన్ని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వాటిన్నింటినీ ఎదుర్కొంటూ 11 గంటల పాటు కష్టపడ్డాడు. చివరకు కెటిల్ స్పందించడంతో టీ చేసుకుని తాగాడు. తన ప్రయత్నాన్నంతా ఆయన ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు తెలిపాడు. దీంతో, ట్విట్టర్‌లో ఆయన చేస్తోన్న పోస్టులకు ఎన్నో రీట్వీట్లు వచ్చాయి. ట్వీట్ల ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాడు.