: చిక్కేది డౌటే... విదేశాలకు పారిపోయిన కాల్ సెంటర్ స్కాం 'షాగీ'!
కాల్ సెంటర్ నడిపి, అమెరికన్లను నిలువునా ముంచి, వందల కోట్ల రూపాయల స్కామ్ నడిపిన 23 ఏళ్ల యువకుడు షాగర్ థాకర్ అలియాస్ షాగీ దేశం విడిచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ కేసు వివరాలు బయటకు పొక్కి, అరెస్టులు ప్రారంభం కాగానే షాగీ దేశం దాటేసినట్టు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. షాగీ ఫోన్ నంబర్ పని చేయకపోవడం ఈ అనుమానానికి ఊతమిస్తోంది. కాగా, షాగీని, అతని విలాస జీవితాన్ని చూపుతూ, తమను మోటివేట్ చేసే వారని కాల్ సెంటర్ లో పనిచేసి అరెస్టయిన ఎంతో మంది వాపోతున్నారు. మీరా రోడ్ కాల్ సెంటర్లో ఒక్కొక్కరికి నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ వేతనాలు ఉండేవని, ఎవరు ఎక్కువగా అమెరికన్లను మోసం చేసి వారితో డబ్బులు ఖాతాలకు బదిలీ చేయిస్తే, అంతటి రేంజిలో జీతాలు వచ్చేవని ఓ ఉద్యోగి తెలిపాడు. ఈ కేసులో ఇప్పటివరకూ 70 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో 630 మందికి నోటీసులు ఇచ్చారు. అమెరికాలోని వివిధ ఏజన్సీలు కేసు విషయంలో సీరియస్ గా ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.