: ఇంకా చిక్కని కాల్ సెంటర్ స్కామ్ 'బిగ్ ఫిష్'... పావులుగా మారి జైళ్లలో మగ్గుతున్న యువత!
అమెరికా, బ్రిటన్ లకు చెందిన ఎంతో మందిని మోసం చేసి వందల కోట్ల రూపాయలను నొక్కేసిన కాల్ సెంటర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. ఈ కేసులో ఒక్క రూపాయి అదనపు ప్రయోజనం పొందక పోయినప్పటికీ, యాజమాన్యం చెప్పింది కదా అని, విదేశీయులను మోసం చేసిన కేసుల్లో వందలాది మంది యువతీ యువకులు అరెస్టై జైళ్లలో మగ్గుతున్నారు. స్కామ్ లో 'బిగ్ ఫిష్'ను పట్టుకుంటే, పలు రహస్యాలు వెలుగులోకి వస్తాయని, ఆయన వెనకున్న మరికొందరి పేర్లూ బయటకు రావచ్చని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముంబైలోని పలు కాల్ సెంటర్లపై ఇప్పటికే దాడులు చేసి దాదాపు 600 మంది ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు, రాయ్ గడ్ జిల్లాలోని కాల్ సెంటర్లపైనా దాడులు చేశారు. కనీసం 10 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న అన్ని కాల్ సెంటర్లపైనా నిఘా పెట్టారు. ఏఏ సెంటర్ల నుంచి ఈ తరహా కాల్స్ వెళ్లాయన్న విషయమై, అమెరికా నుంచి తెప్పించిన కాల్ డేటా సాయంతో విచారిస్తున్నారు. థానే, నవీ ముంబై, ముంబై ప్రాంతాల్లోని పలు సెంటర్లు, ఇండియాలోని పన్ను చెల్లింపుదారులకు కూడా ఇదే విధమైన కాల్స్ చేసి వారి నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేసినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.