: తొలిసారి జాకీ చాన్ ను కలిసినప్పుడు నోట మాటరాలేదు: అమైరా దస్తర్
తొలిసారి జాకీ చాన్ ను కలిసినప్పుడు ఆనందం, ఆశ్చర్యంతో నోటమాట రాలేదని బాలీవుడ్ నటి అమైరా దస్తర్ తెలిపింది. 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీచాన్ తో కలిసి నటిస్తున్న అమైరా దస్తర్ ఆ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకున్న సందర్భంగా చెబుతూ... అంతపెద్ద నటుడిని చూసి నోట మాటరాక మౌనంగా ఉండిపోయానని చెప్పింది. ఆ తరువాత ఆయనే బెరుకుపోగొట్టి మాట్లాడారని తెలిపింది. దీంతో ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఎలాంటి భేషజాలు లేకుండా మాట్లాడగల వ్యక్తి అని గుర్తించానని ఆమె తెలిపింది. ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని తెలిపింది. మొత్తం ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడైన జాకీచాన్ కు తాను గొప్ప అనే భావన లేదని, చాలా కామన్ మేన్ లా ఉంటారని తెలిపింది. షూటింగ్ లో కూడా స్టార్లలా తానున్న సన్నివేశాలే ముందు షూట్ చేయాలని భావించరని, ఆయనకు సంబంధించని సీన్లను షూట్ చేస్తున్నా...వాటిని గమనిస్తూ ఓ మూల కూర్చుంటారని తెలిపింది. ఏదైనా అభ్యంతరకరంగా ఉందని అనిపిస్తే సలహా ఇస్తారని, లేకపోతే షూటింగ్ లో జోక్యం చేసుకోరని తెలిపింది. ఆయన పెద్ద స్టార్ లా ఎప్పుడూ ప్రవర్తించలేదని తెలిపింది. షూటింగ్ స్పాట్ లో అందరు నటీనటులకు ఆయన ఆదర్శమని అమైరా దస్తర్ తెలిపింది. సంభాషణలతో కంటే యాక్షన్ తో టెక్నిక్స్ ను చూపించడం ద్వారా సన్నివేశాన్ని రక్తికట్టించేందుకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని చెప్పింది. జాకీచాన్ ఓ అద్భుతమైన వ్యక్తి అని ఆమె తెలిపింది. ఈ సినిమాలో ఆమెతో పాటు సోనూ సూద్, దిశా పటానీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.