: తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన 'ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్' మోనికా గూర్డె!
పెర్ఫ్యూమ్ రీసర్చర్, పెర్ఫ్యూమ్ ల తయారీదారు అయిన మోనికా గూర్డె దారుణ హత్యకు గురయింది. గోవాలోని సంగోల్డాలో ఉన్న రెంటెడ్ ఫ్లాట్ లో గుర్తు తెలియని దుండగులు ఆమెను హత్య చేశారు. 39 ఏళ్ల మోనికాను 'ఫస్ట్ లేడీ ఆఫ్ స్మెల్' అని పిలుస్తుంటారు. హత్యకు గురైన సమయంలో ఆమె నగ్నంగా ఉంది. బెడ్ పై ఉన్న ఆమె రెండు చేతులు మంచానికి కట్టేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అత్యాచార కోణంలో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 9 గంటలకు పనిమనిషి మోనికా ఇంటికి వెళ్లింది. తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాలేదు. దీంతో, పొరుగు వారి సహాయంతో మోనికా సోదరుడు ఆనంద్ కు ఫోన్ చేయించింది. వెంటనే అతను మోనికా నుంచి విడిపోయిన భర్త, ఫొటోగ్రాఫర్ అయిన భరత్ కు ఫోన్ చేశాడు. అంతేకాకుండా, మోనికా పొరుగువారికి కూడా ఫోన్ చేశాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 11.30 గంటలకు నకిలీ తాళంతో తలుపు తీసి, లోపలకు వెళ్లి చూడగా... మంచంపై శవంగా మోనికా పడుంది. ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేదు. చేతులు కట్టేసి ఉన్నాయి. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు. ఇంట్లోని విలువైన వస్తువులు ఏవీ పోలేదు. అంతేకాదు, మోనికా శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. మొహం మాత్రం ఎర్రగా ఉంది. దీంతో, ఆమెపై అత్యాచారం చేసి, దిండు సాయంతో ఊపిరి ఆడకుండా హత్య చేసి ఉంటారనే నిర్ణయానికి పోలీసులు వచ్చారు. ఆమె సన్నిహితులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అపార్ట్ మెంట్ లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు నిదానంగా కొనసాగుతోంది.