: అమెరికాలో మరోమారు పడగ విప్పిన జాత్యహంకారం.. సిక్కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు జాత్యహంకారం బుసలు కొట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సిక్కు వ్యక్తిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అతడి తలపాగాను తొలగించి జట్టును కత్తిరించి తీవ్రంగా అవమానించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుండగులపై జాతి విద్వేష దాడి కింద కేసు నమోదు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాలిఫోర్నియాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న మాన్‌సింగ్ ఖల్సా గత నెల 25న విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండుగులు బీర్ క్యాన్ విసిరారు. అనంతరం కారును వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉండడంతో ఆయన తలపాగా తీసేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. జుట్టు కత్తిరించారు. దుండగుల వయసు 20-30 ఏళ్ల మధ్యలో ఉంటుందని ఖల్సా తెలిపారు. దాడి ఘటనపై సిక్కు సంఘాలు రిచ్‌మండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాయి.