: కాళ్లు, చేతులు విరిచి బాలుడితో భిక్షమెత్తించిన దుర్మార్గుడు.. ఆస్పత్రిలో బాలుడు మృతి.. కర్నూలులో ఘోరం!
పలకాబలపం పట్టాల్సిన చిట్టిచేతులతో ఓ దుర్మార్గుడు భిక్షమెత్తించాడు. అన్నీ సవ్యంగా ఉంటే భిక్షమెవరు వేస్తారని అనుకున్నాడో ఏమో, బాలుడి కాళ్లు చేతులు బలవంతంగా విరిచేశాడు. ఆపై కసిదీరా శరీరంపై వాతలు పెట్టాడు. ఈ చిత్రహింసలు భరించలేని ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కర్నూలులో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జూపాడు బంగ్లా మండలం లింగాపురానికి చెందిన గోపాల్(55) పనీపాట లేకుండా తిరుగుతున్నాడు. వెలుగోడు సమీపంలో నివాసం ఏర్పరచుకున్న గోపాల్.. ప్రకాశం జిల్లాకు చెందిన గణేశ్ అనే బాలుడిని ఇటీవల వెంట తీసుకొచ్చి అతడితో భిక్షాటన చేయించేవాడు. భిక్షాటనకు నిరాకరించిన బాలుడిని గోపాల్‌తో పాటు అతడితో సహజీవనం చేస్తున్న లక్ష్మి కూడా తరచూ కొట్టి భిక్షాటనకు పంపేవారు. రెండు రోజుల క్రితం కూడా ఇద్దరూ కలిసి బాలుడిని చావబాదారు. దీంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. తాను బాలుడి తాతనని చెబుతూ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో గణేశ్‌ను చేర్చాడు. బాలుడి తండ్రి రాజశేఖర్ కొడుకును కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని వైద్యులను నమ్మించాడు. కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలైన బాలుడిని చూసి చలించిపోయిన వైద్యులు వెంటనే చిన్నారికి వైద్యం అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందాడు. విషయం తెలిసిన గోపాల్, లక్ష్మి.. గణేశ్ మృతదేహాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.