: చంద్రబాబు లాంటి నాయకులు దేశానికి అవసరం: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నాయకుడు దేశానికి అవసరమని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. చంద్రబాబు లాంటి సంకల్పమే దేశంలోని రాజకీయ నాయకులందరికీ ఉండాలని సూచించారు. అప్పుడే దేశం మరో మూడు దశాబ్దాలపాటు స్థిరంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో శుక్రవారం చంద్రబాబుతో కలిసి ‘పట్టణీకరణ-డిజిటలీకరణ’ అంశంపై అమితాబ్ మాట్లాడారు. 2050 నాటికి దాదాపు 700 మిలియన్ మంది ప్రజలు పట్టణాల బాట పట్టనున్నారని, ఇది అమెరికా దేశ జనాభాకు రెండున్నర రెట్లు అధికమని తెలిపారు. నిమిషానికి 30 మంది గ్రామాల నుంచి పట్టణాలకు తరలివస్తున్నారని అన్నారు. స్వాతంత్ర్యానంతరం పట్టణీకరణకు రాజకీయ నాయకులు సానుకూలంగా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఎంతో శాస్త్రీయంగా, సమర్థంగా పట్టణీకరణ చేసి చూపించారని కొనియాడారు. అమరావతి కోసం కూడా చంద్రబాబు అలానే కష్టపడుతున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం పట్టణీకరణ గురించి మాట్లాడుతున్న తొలి ప్రభుత్వం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. అయితే సమర్థవంతమైన, సమగ్ర పట్టణీకరణ విధానం కావాల్సి ఉటుందన్నారు. అదే కనుక చేయగలిగితే చంద్రబాబు ప్రపంచానికే మోడల్‌ను ఇచ్చినవారు అవుతారని అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు.