: జిల్లాల ఏర్పాటులో రాజ్యాంగ ఉల్లంఘన.. కేంద్ర ఎన్నికల సంఘానికి, హోంశాఖకు ఫిర్యాదు చేస్తా: రేవంత్రెడ్డి
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో తెలంగాణ సర్కారు తీరుపై టీటీడీపీ నేత రేవంత్రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈరోజు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, హోంశాఖకు, న్యాయశాఖకు తాను ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం గతంలో చేసిన చట్టాన్ని ఆయన గుర్తుచేస్తూ.. నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు జిల్లాల పునర్విభజన చేయరాదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి పట్టున్న ప్రాంతాలను, పట్టులేని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని విభజన చేస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 153కి పెంచేందుకు కేంద్రం రాష్ట్ర విభజన చట్టంలోనే పేర్కొందని, కేసీఆర్ మరికొంత కాలం ఎందుకు ఆగడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ చేస్తోన్న ఈ పనులకు పరోక్షంగా సహకరిస్తోందని ఆయన ఆరోపించారు.