: ‘సర్జికల్ స్ట్రయిక్స్ ను రాజకీయం చేస్తారా?’.. మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కేజ్రీవాల్
పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిన సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవలే ప్రధాని మోదీకి సెల్యూట్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, సర్జికల్ స్ట్రయిక్స్పై ఆధారాలు బయటపెట్టాలన్నారు. అలాంటి కేజ్రీవాల్ కు మోదీని విమర్శించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇప్పుడు తెగ కోపం వచ్చేసింది. సైన్యం చేసిన దాడిని మోదీ రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని రాహుల్ అనడాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టారు. సర్జికల్ స్ట్రయిక్స్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అటువంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. సైనికులు చేసిన సాహసాన్ని రాజకీయం చేయడమేంటని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. మొదట రాహుల్ గాంధీ ఈ సర్జికల్ స్ట్రయిక్స్పై స్పందిస్తూ... ప్రధానిగా బాధ్యతలు చేబట్టిన మోదీ రెండేళ్లలో చేసిన మొదటి మంచి పని ఇదేనని అన్నారు. కాగా, నిన్న మరోసారి ఈ అంశంపై స్పందించిన రాహుల్ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కేజ్రీవాల్ సర్జికల్ స్ట్రయిక్స్పై చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ ఎంతగానో మెచ్చుకున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ‘రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే సర్జికల్ స్ట్రయిక్స్పై ఆధారాలు చూపించాలని అంటున్నార’ని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఇదే విధంగా రాహుల్ గాంధీని కేజ్రీవాల్ విమర్శిస్తుండడం గమనార్హం.