: మహాత్మునిపై 'జాత్యహంకారి' ముద్ర.. గాంధీ విగ్రహాన్ని తొలగించడానికి సిద్ధమైన ఘనా ప్రభుత్వం!
యావత్ ప్రపంచం శాంతి దూతగా, మార్గదర్శిగా భావిస్తున్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని తీసివేయాలని ఘనా దేశ ప్రభుత్వం భావిస్తోంది. గత జూన్ లో ఘనా రాజధాని అక్రాలోని ఓ యూనివర్శిటీ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం, యూనివర్శిటీ ఆఫ్ ఘనాలోని కొందరు ప్రొఫెసర్లు గాంధీ విగ్రహాన్ని తొలగించాలంటూ పిటిషన్ల ఉద్యమాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీని జాత్యహంకారిగా వారు అభివర్ణిస్తున్నారు. నల్లజాతీయులైన ఆఫ్రికావాసుల కంటే భారతీయులు ఎంతో ఉన్నతులని గాంధీ చెప్పినట్టు వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే, గాంధీ విగ్రహాన్ని తీసివేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, విగ్రహ భద్రత కోసమే దాన్ని యూనివర్శిటీ నుంచి ఇతర ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు, విగ్రహాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తే సరిపోదని... దాన్ని తిరిగి ఇండియాకు తిప్పి పంపాలని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆబాదెల్ కాంబోస్ డిమాండ్ చేస్తున్నారు. ఘనాలో ఎక్కడైనా సరే గాంధీకి ఆదరణ ఉంటుందని తాను భావించడం లేదని ఆయన తెలిపారు. గాంధీకి బదులు ఘనా తొలి అధ్యక్షుడు క్వామే ఎన్ క్రుమా లేదా స్థానిక నేత యా అసంటెవా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.