: ఏపీపై నీతి ఆయోగ్ ప్రశంసల జల్లు.. ఏపీ విధానాలు దేశానికే ఆదర్శమంటూ ఆకాశానికి ఎత్తేసిన వైనం!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నీతి అయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు భేష్ అంటూ కొనియాడింది. వివిధ రంగాల్లో ఏపీ సర్కారు అమలు చేసిన, చేస్తున్న 8 విధానాలను ఈ సందర్భంగా గుర్తుచేసింది. వీటిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని తెలిపింది. రెండు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఆయా రాష్ట్రాలు నీతి ఆయోగ్‌కు నివేదించాయి. వీటిని అధ్యయనం చేసిన నీతి ఆయోగ్ ‘రాష్ట్రాల ముందడుగు’ పేరుతో నివేదిక రూపొందించింది. అందులో ఏపీ అమలు చేస్తున్న 8 విధానాలు దేశానికే ఆదర్శమని పేర్కొంది. ఆ ఎనిమిది అంశాలు ఏంటంటే.. ఆధార్‌తో ఎరువు: వంట గ్యాస్ విషయంలో ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం విజయవంతం అవడంతో ఈ విధానాన్ని ఎరువుల రంగంలోనూ అమలు చేయాలని 2016-17 బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. తొలుత దేశంలోని 16 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దీనిని ప్రారంభించారు. దీనికి కృష్ణా జిల్లా కలెక్టర్ మరిన్ని మెరుగులద్ది అన్ని ఎరువుల దుకాణాల్లోనూ ప్రారంభించారు. దీనివల్ల 5.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. అందరికీ ఎరువుల సబ్సిడీ సక్రమంగా అందింది. వ్యవసాయోత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. ఎరువుల దారి మళ్లింపుకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం 90 శాతం మంది రైతులు ఈ విధానంలో ఎరువులు తీసుకుంటున్నారు. భూగర్భ జలాల నిర్వహణ: ఏపీలో రైతు నిర్వహణ భూగర్భ వ్యవస్థ ప్రాజెక్టును చేపట్టడం ద్వారా అనతి కాలంలోనే భూగర్భ జలాలు పెరిగినట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. ఉమ్మడి ఏపీలో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఈ పథకం మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా కరవు ప్రభావిత జిల్లాల్లో దీనిని అమలు చేయాలని సూచించింది. మత్స్య విధానం: గత రెండు దశాబ్దాల కాలంలో ఏపీలో చేపల ఉత్పత్తి మూడింతలు పెరిగింది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న సముద్ర ఉత్పత్తుల్లో 2009-10లో ఏపీ వాటా 20 శాతం కాగా 2014-15 నాటికి అది 42 శాతానికి చేరుకుంది. 14.5 లక్షల మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తున్నట్టు నీతి ఆయోగ్ పేర్కొంది. స్వచ్ఛ విద్యాలయాలు: సర్కారు స్కూళ్లలో బాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేకపోవడంతో డ్రాపౌట్స్ (మధ్యలోనే చదువు మానేసేవారు) పెరుగుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థలు, పైవేటు కంపెనీల ‘సామాజిక బాధ్యత’ నిధులను ఉపయోగించి జిల్లాలోని అన్ని సర్కారు బడుల్లో ప్రీఫ్యాబ్రికేటెడ్ టెక్నాలజీతో మరుగుదొడ్లను అనుకున్న సమయంలో నిర్మించారు. దీంతో బడుల్లో డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గాయి. ఇ-గవర్నెన్స్: అన్ని శాఖల పనితీరును తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం కోర్ డ్యాష్‌బోర్డు విధానం అత్యుత్తమమైనదిగా నీతి ఆయోగ్ పేర్కొంది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. ఏపీని ఆదర్శంగా తీసుకున్న హర్యాణా కూడా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇ-పాస్: ఎస్సీ విద్యార్థులకు కేంద్రం అందిస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కొన్ని పరిమితుల వల్ల చాలా రాష్ట్రాల్లో సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఇ-పాస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. దీనివల్ల 125 నకిలీ కళాశాలలు మూతపడ్డాయి. నేరుగా అర్హులకే స్కాలర్‌షిప్‌లు అందుతున్నాయి. ల్యాండ్ పూలింగ్: రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అంటూ లేని నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. 2015లో ప్రారంభమైన ఈ పథకానికి అతి తక్కువ వ్యవధిలోనే అనూహ్య స్పందన వచ్చిందని, మొత్తం 33,811 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నీతి ఆయోగ్ కొనియాడింది. రవాణాశాఖ డిజిటలైజేషన్: రవాణాశాఖ డిజిటలైజేషన్ వల్ల రవాణా శాఖలో పారదర్శకత, జవాబుదారీ తనం పెరిగాయని నీతి ఆయోగ్ పేర్కొంది. రవాణాశాఖలో గతంలో మధ్యవర్తులు, ఏజెంట్లు రెచ్చిపోయేవారని, ప్రభుత్వానికి రూపాయి ఇచ్చి వారు రూ.4.27 పైసలు వెనకేసుకునే వారని పేర్కొంది. కానీ, డిజిటలైజేషన్ అమల్లోకి వచ్చాక అక్రమార్జనకు కళ్లెం పడిందని పేర్కొంది. ఈ విధానం పౌరులకు సౌకర్యవంతంగా మారిందని పేర్కొన్న నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News