: అధికారంలో ఉండి తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరు: సీఎం చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేసినా ప్రజలు పట్టించుకోరని, అదే, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నాయకత్వ సాధికారత వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీల ఎమ్మెల్యేలపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఆశించిన మేరకు సేవలు అందకపోతే ప్రజలు సహించరని అన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరుపై 3 నెలలకు ఒకసారి సర్వే జరిపిస్తున్నామని, ఆ సర్వే వివరాలు అందజేస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో 80 శాతం సంతృప్తి రావాలని, రాజకీయ ఏకీకరణ 80 శాతం జరగాలని సూచించారు. సంక్షేమ పథకాలపై ఉన్న అనుకూలతను మన పార్టీ సద్వినియోగం చేసుకోవాలని, నేతల మధ్య విభేదాలను తాను సహించనని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.