: అలాంటి పరిస్థితి వస్తే ఉరివేసుకుని చస్తాం.. కానీ, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయబోం: మంత్రి తుమ్మల
తెలంగాణ సర్కారు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిప్పికొట్టారు. గత పాలకులు తెలంగాణ రైతుల గురించి పట్టించుకోలేదని ఆయన అన్నారు. అటువంటి వారు రైతుల కోసం అంటూ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కారు చేస్తోన్న అభివృద్ధిని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. అందుకే తమపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రైతులకు విత్తనాలు, ఎరువులు అందించామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లడిల్లారని ఆయన వ్యాఖ్యానించారు. 24 గంటలూ విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా తమ సర్కారు పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నడూ ద్రోహం చేయబోమని, వారికి నష్టం కలిగించే పరిస్థితే వస్తే ఉరివేసుకుని చస్తాం కానీ, అటువంటి పనులు మాత్రం చేయబోమని అన్నారు. తమ సర్కారు చేపడుతోన్న పథకాలు చూసి విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగ్గా కేంద్రంతో తెలంగాణ సత్సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు.