: చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు తొలి పరీక్ష...వన్డే జట్టు ఎంపిక నేడే


టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కు నేడు తొలిపరీక్ష ఎదురు కానుంది. ఎమ్మెస్కే నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ నేడు తొలిసారి ముంబైలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ తో ఐదు వన్డేల సిరీస్ లో పాల్గొననున్న టీమిండియా జట్టును ఎంపిక చేస్తారు. అయితే, కొత్త సెలక్షన్ టీమ్ కు ఓపెనర్ల ఎంపిక కష్టం కానుంది. ధావన్, రాహుల్ గాయాల కారణంగా సిరీస్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో గంభీర్ ను వన్డేల్లోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరం. అదే సమయంలో యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ తదితరులంతా జట్టులో పునరాగమనం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో వీరంతా సత్తా చాటుతున్నవారే కావడంతో జట్టులో ఎవరికి స్థానం లభిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. వన్డే కెప్టెన్ ధోనీ నేతృత్వంలోని జట్టులో పెద్దగా మార్పులుండే అవకాశం లేనప్పటికీ, కొత్త కమిటీ జట్టును కొత్త, పాత కలయికతో ఎలా ఎంపిక చేస్తారా? అని సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ప్రధానంగా జట్టులో స్థానం కోసం స్పిన్నర్లు, ఆల్ రౌండర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్పిన్నర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్ పోటీ పడుతున్నారు. ఆల్ రౌండర్లలో ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, స్టువర్ట్ బిన్నీల మధ్య పోటీ నెలకొంది. చివరికి జట్టులో ఎవరు స్థానం సంపాదించుకుని ఈ నెల 16 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్ లో స్థానం సంపాదించుకుంటారో చూడాలి.

  • Loading...

More Telugu News