: పులివెందులలో కూడా జగన్ గెలవని పరిస్థితిని చంద్రబాబు తెచ్చారు: ఏపీ మంత్రి దేవినేని ఉమ
ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, రాయలసీమకు నీరు తెప్పించిన ఘనత చంద్రబాబుదేనని, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో పోటీ పడ్డా వైఎస్ జగన్ గెలవలేని పరిస్థితి నెలకొందని మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, నెలకోసారి మాత్రమే జగన్ కు రైతులు గుర్తుకు వస్తారని, ధర్నాలంటూ సభలు పెట్టి మొసలి కన్నీరు కార్చి, మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. అనంతపురంలో కరవును ఎదుర్కొన్నామని, రెయిన్ గన్స్ తో పంటలను కాపాడామని చెప్పిన ఆయన, వైకాపాకు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలంతా చూస్తున్నారని, ఆయన నేతృత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందని నమ్మి అండగా నిలుస్తున్నారని వివరించారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేయడం వల్లే ఇప్పుడిలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తూ, శ్రమిస్తున్నారని దేవినేని చెప్పారు.