: చిరంజీవిలోని ఆ క్వాలిటీ అంటే నాకు బాగా ఇష్టం: పోసాని కృష్ణమురళి
మెగాస్టార్ చిరంజీవికి ఎప్పుడు నమస్కారం చేసినా తిరిగి అంతే గౌరవంతో ఆయన ప్రతినమస్కారం చేస్తారని, ఆయనలో ఆ క్వాలిటీ అంటే తనకు బాగా ఇష్టమని ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నంబరు 150’ చిత్రం బృందం పోసానికి సంబంధించిన ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఆ వీడియోలో పోసాని ఏమి మాట్లాడారంటే... చిరంజీవితో కలిసి మనం ఎన్నేళ్లయినా ప్రయాణించవచ్చని అన్నారు. మనం చిరంజీవితో మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఆయన దగ్గరకి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెడితే, తిరిగే అంతే గౌరవంతో ప్రతిస్పందిస్తారంటూ ప్రశంసించారు. చిరంజీవి 150వ చిత్రమైన ‘ఖైదీ నంబరు 150’ సినిమా 150 రోజులు ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వీవీ వినాయక్, రామ్ చరణ్ తో కూడా తనకున్న బంధాన్ని ఆయన ప్రస్తావించారు. తనకు నచ్చిన దర్శకుడు వినాయక్ అని, ఎవరితోనైనా ఆయన జెంటిల్ మెన్ లా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజా చిత్రం ‘ధ్రువ’లో తనకు మంచిపాత్ర ఇచ్చారని పోసాని పేర్కొన్నారు.