: ‘పీవోకేలో అసలు సర్జికల్ దాడులు జరిగాయా?’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తారా?: కేజ్రీవాల్పై కేంద్రమంత్రి మండిపాటు
పీవోకేలో ఇటీవల భారత ఆర్మీ చేపట్టిన లక్షిత దాడులపై స్పందిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి జై కొడుతూనే దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని వీడియో విడుదల చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... భారత సైన్యం సాధించిన విజయాన్ని జీర్ణించుకోలేకే ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కేజ్రీవాల్ లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సంబరాలు చేసుకోవాల్సింది పోయి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడమేంటని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ తో పాటు కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ లను భారత జాతి క్షమించదని ఆయన అన్నారు. పాక్ పత్రికలు ప్రచురించే కథనాలపైనే వారు దృష్టిపెట్టారని ఆయన విమర్శించారు. ‘పీవోకేలో అసలు లక్షిత దాడులు జరిగాయా?’ అని అనుమానాలు వ్యక్తం చేయడమేంటని ఆయన దుయ్యబట్టారు. వారు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ఆయన అన్నారు.