: 'బాబాయ్ తో ఎంతసేపు మాట్లాడినా ఒక్క సలహా కూడా ఇవ్వడు' అంటూ వాపోయిన బాలీవుడ్ స్టార్
తన బాబాయ్ (అనిల్ కపూర్) తో ఎంత సేపు మాట్లాడినా ఒక్క సలహా కూడా ఇవ్వడని బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ తెలిపాడు. అయితే తన బాబాయ్ మాటల ద్వారా నేర్చుకునే తెలివి తనకు ఉందని అర్జున్ వెల్లడించాడు. దీనిపై వాళ్ల బాబాయ్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మాట్లాడుతూ, తాను ఎవరికీ సలహాలు ఇవ్వనని అన్నారు. ఎవరికి వారుగా అనుభవాల ద్వారా నేర్చుకోవాలని సూచించారు. తానూ అలాగే నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ఎదుటి వారిని చూసి తెలుసుకోవాలని ఆయన చెప్పారు. తన పిల్లలు సోనమ్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ లకు కూడా తాను ఎలాంటి సలహాలు ఇవ్వనని ఆయన తెలిపారు. మంచి జరిగినా, చెడు జరిగినా మనల్ని ఎవరూ వేలుపెట్టి చూపించకూడదని తన అభిప్రాయమని ఆయన అన్నారు. అందుకే ఎదుటివారికి అది మంచిది, ఇది మంచిది, ఇలా చేయండి, అలా చేయండి అని సలహాలు ఇవ్వకూడదని ఆయన చెప్పారు. ఏదో చేయాలన్న ఆలోచన వాళ్లకే రావాలని, అలా ఆలోచన వచ్చినప్పుడే దానిని ఎవరైనా సరే సమర్థవంతంగా చేయగలరని ఆయన స్పష్టం చేశారు.