: 'గో టూ హెల్... మాకు రష్యా, చైనాలున్నాయి': ఒబామాపై సీరియస్ అయిన రోడ్రిగో డుటెర్టీ
తమ దేశానికి ఆయుధాలను సరఫరా చేసేందుకు నిరాకరించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ విరుచుకుపడ్డారు. అమెరికా ఆయుధాలు విక్రయించకుంటే, తామేమీ బాధపడబోమని, రష్యా, చైనాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ 'గో టూ హెల్' అని వ్యాఖ్యానించారు. అమెరికా అంటే తనకున్న గౌరవం పోయిందని వ్యాఖ్యానించిన డుటెర్టీ, క్షిపణులు తదితర ఆయుధాలను తొలుత విక్రయిస్తామని హామీ ఇచ్చిన అమెరికా, ఆపై వెనక్కు మళ్లిందని, రష్యా, చైనాలు వాటిని సులువుగా తమకు అందించనున్నాయని అన్నారు. దేశపు భద్రత, ప్రజల క్షేమం కోసమే తాను కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వ అధికారులను రష్యాకు పంపించనున్నానని, "ఏం బాధపడొద్దు. మీకు కావాల్సిన వన్నీ మా దగ్గరున్నాయి. వాటిని మేము మీకు అందిస్తాం" అని రష్యా నుంచి హామీ లభించిందని తెలిపారు.