: త్యాగరాయ గానసభలో తన్నులాట... నివ్వెరబోయిన అతిథులు!
హైదరాబాదు, చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో రచయిత్రి రాజేశ్వరీ చంద్రజ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం తన్నులాటతో రసాభాసగా ముగిసింది. వివరాల్లోకి వెళ్తే... చిట్యాలకు చెందిన అంజనా ఎక్సప్లోజివ్స్ కంపెనీ యజమాని దొమ్మేటి వెంకటస్వామికి సూర్యప్రభ అనే మహిళతో 1991లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే సూర్యప్రభకు విడాకులు ఇవ్వని వెంకటస్వామి, రచయిత్రి రాజేశ్వరి చంద్రజతో కాపురం ఉంటున్నారని సూర్యప్రభ ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ పుస్తకావిష్కరణకు హాజరైన అతిథులకు అందజేసింది. దీనిని అడ్డుకునేందుకు వెంకటస్వామి ప్రయత్నించడంతో సూర్యప్రభ బంధువులు రంగప్రవేశం చేసి, తలో చేయి వేసి ఆయనకు దేహశుద్ధి చేశారు. ఈ వివాదం మరింత ముదరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగేలా చేయగా, చివరికి రాజేశ్వరీ చంద్రజ తన మొదటి భార్య అని వెంకటస్వామి చెప్పడం కొసమెరుపు. దీనిపై మండిపడ్డ సూర్యప్రభ, సంసారాన్ని పాడుచేసే మహిళను త్యాగరాయగానసభలోకి అనుమతించవద్దని ఆవేశంగా అనడం జరిగింది.