: ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రిపైకి చెప్పు విసిరిన మహిళ
ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ పై భావనా అరోరా అనే మహిళ చెప్పు విసిరింది. అయితే, తృటిలో ఆయన తప్పించుకున్నారు. కోల్ కతా కు చెందిన పలు సంస్థల పన్ను ఎగవేతలకు సంబంధించి ఆయన ప్రమేయముందని ఆరోపిస్తూ గతంలో సమన్లు జారీ అయ్యాయి. ఇందులో ఒక కేసుకు సంబంధించి ఆయన ఈరోజు మధ్యాహ్నం ఇన్ కం ట్యాక్స్ కార్యాలయంకు వెళ్లారు. తిరిగి బయటకు వచ్చిన సందర్భంలో ఒక మహిళ చెప్పు విసిరింది. అయితే, ఆ చెప్పు వెళ్లి ఆయన వాహనంపై పడింది. ఆ వాహనంలో ఆప్ నేతలు సంజయ్ సింగ్, అశుతోష్ ఉన్నారు. కాగా, ఎల్ఓసీ వద్ద భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని, అందుకే తాను ఈ దాడి చేశానని, ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక వర్గానికి చెందిన భావనా అరోరా చెప్పింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఏం కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై ఇంక్ దాడికి పాల్పడటం ద్వారా భావనా అరోరా వార్తల్లో నిలిచింది.