: జయలలిత ఆసుపత్రిలో ఉన్నా... తమిళనాడు మొత్తం ఒక వ్యక్తి కనుసన్నల్లో నడుస్తోంది!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం విదితమే. ఆమె అనారోగ్యంపై ఆసుపత్రి బులిటిన్లే తప్ప వేరే సమాచారం లేదు. ఇలాంటి పరిస్థితే ఇంకెక్కడైనా తలెత్తితే ముఖ్యమంత్రి వారసులు తెరపైకి వచ్చి తెగ హడావుడి చేసేవారు. కానీ తమిళనాట అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పరిపాలన మొత్తం ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. కేబినెట్ మొత్తం హడావుడిగా ఆసుపత్రికి చేరుకుని నిదానంగా బయటకు వచ్చి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. వైద్యుల బులెటిన్ ల ప్రకారం జయలలిత ఈ రోజే కళ్లు తెరిచారు. ఊపిరి కూడా స్వతహాగా కాసేపు పీల్చుకున్నారు. అంటే వెంటిలేటర్ పై ఉంటూ ఆదేశాలిచ్చే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు రాష్ట్రం ఇంత క్రమశిక్షణగా ఎలా సాగిపోతోంది? పొరుగునున్న కర్ణాటకతో కావేరీ జల వివాదం నడుస్తున్నప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా రాష్ట్రాన్ని ఎవరు నడిపిస్తున్నారు? అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాష్ట్రాన్ని క్రమశిక్షణగా నడిపించడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. 2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్ (62) శక్తియుక్తులపై అపార నమ్మకంతో జయలలిత ఆమెను సలహాదారుగా నియమించుకున్నారు. జయలలితకు అత్యంత విశ్వసనీయురాలైన వ్యక్తిగా పేరొందిన షీలా బాలాకృష్ణన్ సలహాల మేరకే తమిళనాడు చీఫ్ సెక్రటరీ పి.రామమోహన్‌రావు, డీజీపీ టీకే రాజేంద్రన్ నడుచుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎలాంటి అలజడులు రేగకుండా జాగ్రత్తపడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి సమయాల్లో తిరుగుబాట్లు, అసమ్మతి, ప్రతిపక్షం ఎగదోయడం, చీలికలు వంటివి ఉంటాయి. అయితే షీలా సూచనల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యూహాత్మకంగా ఆమె రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. అన్నాడీఎంకే కీలక మంత్రులైన పన్నీర్ సెల్వం వంటి సీనియర్లు కూడా ఆమె సూచనలు, సలహాల మేరకు నడుచుకుంటున్నారని సమాచారం. దీంతోనే జయలలిత ఆసుపత్రి పాలై పదిరోజులవుతున్నా ఎలాంటి సమస్య లేకుండా అధికారపార్టీ నెట్టుకొస్తోంది. కాగా, జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రిలో ఆమె ఉన్న గది సమీపంలోనే ఓ గదిలో షీలా బాలాకృష్ణన్ ఉంటున్నారు. అదే అంతస్తులో ఆమె పక్క గదిలో శశికళ బస చేశారు. దీంతో ఒకవైపు జయలలిత ఆరోగ్యంపై నిర్ణయాలు, పరిపాలనపై పట్టు చాటుకుంటూ ఆమె తమిళనాడును ఆదుకుంటున్నారు. దీనిపై రాజకీయవర్గాల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ అమ్మ ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేక, మౌనంగా భరిస్తున్నారు.