: ఏపీ నవ్యరాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ తోడ్పాటు: నరేంద్ర మోదీ
సతీసమేతంగా భారత్లో పర్యటిస్తోన్న సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్ ఈరోజు ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇరువురు ప్రధానులు ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, పెట్టుబడులతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతంరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏపీ నవ్యరాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్ తోడ్పాటు అందిస్తుందని ఆయన చెప్పారు. భారత్, సింగపూర్ మధ్య ఒప్పందాలపై ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా తయారు చేసినట్లు మోదీ పేర్కొన్నారు. అందులో భాగంగా నైపుణ్యాభివృద్ధి అంశంలో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. మీడియా సమావేశంలో సింగపూర్ ప్రధాని లీ సియోన్ మాట్లాడుతూ.. భారత్- సింగపూర్ ల మధ్య వాణిజ్య సంబంధాలను అభివృద్ధి పరుచుకోవడంపై చర్చలు జరిగాయని అన్నారు. గత సంవత్సరమే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని ఆయన అన్నారు.