: అవును, నేతాజీ ఆ విమాన ప్రమాదంలో మరణించారు...కీలక పత్రాలు విడుదల చేసిన జపాన్


నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై ఎన్నో అనుమానాలు. విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందారని పలువురు పేర్కొంటుండగా, లేదు, ఆ విమాన ప్రమాదం నుంచి బతికి బయటపడి, స్వతంత్ర భారతావనిలో స్వామీజీగా అజ్ఞాతవాసంలో జీవించారని మరికొందరు చెబుతుంటారు. అయితే నేతాజీ మృతిపై భారత ప్రభుత్వం కీలక పత్రాలు విడుదల చేసినప్పటికీ ఆయన మృతిపై చిక్కుముడి వీడలేదు. దీంతో జపాన్ లోని కీలక పత్రాలను విడుదల చేయాలంటూ భారత ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ అభ్యర్థనకు స్పందించిన జపాన్ ప్రభుత్వం తాజాగా కీలక పత్రాలు విడుదల చేసింది. 1945లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించి ఉంటారన్న వార్తలను ఈ పత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ పత్రాల్లో ఆనాటి ఘటనలో బోస్ కు వైద్యమందించిన తైవాన్‌ సైనిక వైద్యుల వాంగ్మూలం ఉండడం విశేషం. ఆగస్టు 18, 1945న మధ్యాహ్నం 1:50 నిమిషాల ప్రాంతంలో చైనా పట్టణమైన డాలియన్ వద్ద బోస్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. తైపీ నుంచి విమానం టాకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నేతాజీ తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్నా విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇతర క్షతగాత్రులకు వైద్యం అందించాలని సుభాష్ చంద్రబోస్ కోరినట్టు తైవాన్ సైనిక వైద్యులు తెలిపారని ఉంది. అదే రోజు రాత్రి 7 గంటలకు పరిస్థితి విషమించడంతో సుభాష్ చంద్రబోస్ మృతిచెందారు. అనంతరం బోస్ వస్తువులను జపాన్ తరలించినట్టు ఈ పత్రాల ద్వారా బహిర్గతమైంది. కాగా, నేతాజీకి సంబంధించిన పలు వస్తువులు టోక్యోలోని రెంకోజీ దేవాలయంలో ఇప్పటికీ భద్రంగా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News