: ‘పాక్’ పావురంతో మోదీకి సందేశం!
భారత్-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ లోని బామియల్ సెక్టార్ లోని సింబాల్ పోస్ట్ వద్ద నిన్న రెండు బెలూన్లు సరిహద్దు దాటి వచ్చాయి. ఈ సంఘటన మరవకముందే, తాజాగా, పఠాన్ కోట్ జిల్లాలో పాకిస్థాన్ పావురం ఒకటి తీసుకువచ్చిన సందేశాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన సందేశం ఉన్న కాగితాన్ని బూడిదరంగు పావురానికి కట్టి సరిహద్దు దాటించారు. ఉర్దూలో రాసి ఉన్న ఈ లేఖలో ‘మోదీ జీ, 1971లో ఇండో పాక్ యుద్ధంలో దెబ్బతిన్న మమ్మల్ని మీరు పరిగణనలోకి తీసుకోరా? పాకిస్థాన్ లోని ప్రతి బాలుడు కూడా భారత్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు’ అంటూ ఆ లేఖలో రాసి ఉందని పఠాన్ కోట్ జిల్లా అధికారులు చెప్పారు. ఈ పావురాన్ని, ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.