: రోడ్డుపైనే రచ్చకెక్కిన రియల్టర్లు.. జేబులోని రివాల్వర్ ను లాక్కునేందుకు యత్నం


భూవివాదంలో రియల్టర్లు రచ్చకెక్కారు. ఓ రెస్టారెంట్‌లో చిన్నగా మొదలైన ఘర్షణ రోడ్డుపైకి వచ్చి పెద్దగా మారింది. ఈ వివాదాన్ని సీసీటీవీలో చూసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రియల్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వివరాల ప్రకారం.. షేక్‌పేట గ్రామ పరిధిలోని వెస్టర్న్ ప్లాజాకు ఎదురుగా ఉన్న 3వేల గజాలను క్వారీ వ్యాపారస్తుడు వెన్నెపల్లి దీపక్‌రావు, పాతబస్తీలో ఓ పార్టీకి చెందిన కేఎస్ ఆనందరావు, శ్రీనివాసరెడ్డి కలిసి రూ.1.30 కోట్లతో కొనుగోలు చేశారు. వివాదాల్లో ఉన్న ఈ భూమిని ముగ్గురూ కలిసి పంచుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మాట్లాడుకునేందుకు దీపక్‌రావు, అతడి స్నేహితుడు మూర్తి, ఆనందరావు కలిసి ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌కు చేరుకున్నారు. మాట్లాడుకుంటున్న సమయంలో తన వద్ద ఉన్న డాక్యుమెంట్లపై సంతకం పెట్టాల్సిందిగా దీపక్‌రావుపై ఆనంద్‌రావు ఒత్తిడి తెచ్చాడు. అయితే తన అడ్వకేటు లేకుండా సంతకం పెట్టేది లేదంటూ దీపక్‌రావు తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య చిన్నగా ఘర్షణ ప్రారంభమైంది. క్రమంగా వేడెక్కడంతో ఒకరినొకరు తోసుకుంటూ రెస్టారెంట్ నుంచి రోడ్డుపైకి వచ్చారు. వాగ్వాదం పెరిగి ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో దీపక్‌రావు జేబులో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను లాక్కునేందుకు ఆనందరావు ప్రయత్నించాడు. ఈ ఘర్షణను సీసీటీవీల్లో చూసిన పోలీసులు వెంటనే స్పందించి క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. రియల్టర్లను నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News