: అది ‘జరిగిన కథ’ కాదు.. అబద్ధాల పుట్ట.. ఉండవల్లిపై తెలంగాణ రచయిత 'జూలూరు' ఫైర్
రాష్ట్రం విడిపోయినా తెలంగాణను ఇంకా తక్కువ చేసి చూపే కుట్రలు కొనసాగుతున్నాయని, అందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన ‘జరిగిన కథ’ ప్రత్యక్ష ఉదాహరణ అని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ రచయిత జూలూరు గౌరీశంకర్ ఆరోపించారు. ఉండవల్లి అబద్ధాల వల్లి అని, ఆయన రాసిన ‘జరిగిన కథ’ అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ సొసైటీ ఆఫ్ తెలంగాణ(బీఈఎస్ఈటీ) ఆవిర్భావ సదస్సులో మాట్లాడిన గౌరీశంకర్ ఉండవల్లిపై విరుచుకుపడ్డారు. కథలు ఎప్పుడూ చరిత్ర కావని పేర్కొన్న ఆయన ఉండవల్లి ‘జరిగిన కథ’ కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. ఒక ప్రాంతం చరిత్రను తక్కువ చేసి చూడడం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని గౌరీ శంకర్ అన్నారు. కావడి బద్దల్లా కలిసి ఉండి కుండల్లా విడిపోదాం అనే కవితలాగానే రెండు రాష్ట్రాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చాక కూడా ఇంకా సీమాంధ్రుల పెత్తనం కొనసాగుతోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఆరోపించారు.