: ఐఏఎస్ భార్యకు వింత వ్యాధి!... విపరీతంగా ఆన్ లైన్ షాపింగ్... ఆదాయపన్ను శాఖ నోటీసులు
ఆన్ లైన్ షాపింగ్ నేడు సర్వసాధారణంగా మారిపోయింది. చేతిలో క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎంత పడితే అంత కొనేస్తున్నారా..? అయితే ఓ సారి ఈ విషయం తెలుసుకోవాల్సిందే. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య ఒకరు ఇలానే భారీగా ఆన్ లైన్ షాపింగ్ చేయగా ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమెకు నోటీసులు పంపించారు. విషయం ఏమిటంటే ఆమె రూ.10 లక్షల విలువైన వస్తువులకు ఆన్ లైన్ షాపింగ్ లో ఆర్డర్ చేయడమే. దీనిపై సదరు ఐఏఎస్ అధికారి ఇచ్చిన వివరణ ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తన భార్యకు కంపల్సివ్ బయింగ్ డిజార్డర్ (కొనకుండా ఉండలేని స్థితి) ఉందంటూ ఆ ఐఏఎస్ అధికారి తెలిపారు. ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో జరిగే ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించేందుకు ఓ సాఫ్ట్ వేర్ సాయంతో నిఘా వేసి ఉంచారు. ఇందులో భాగంగానే ఐఏఎస్ అధికారి సతీమణి షాపింగ్ వ్యవహారం వారి కంట్లో పడడంతో నోటీసులు ఇచ్చారు. దీనికి ఆమె వివరణ ఇవ్వాల్సి ఉంది.