: ముస్తాబైన ఏపీ తాత్కాలిక సచివాలయం.. రేపటి నుంచి పాలన మొదలు
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం పాలనకు ముస్తాబైంది. రేపటి నుంచి నవ్యాంధ్ర పాలన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే సాగనుంది. ఇందులోని ఐదు బ్లాకులకు సంబంధించి కీలకమైన ఆర్థిక, హోం, రెవెన్యూ శాఖలతోపాటు మొత్తం 48 శాఖలకు చెందిన 80 శాతం ఫైళ్లు శనివారం సాయంత్రానికే ఇక్కడకు చేరుకున్నాయి. మిగిలినవి ఈరోజు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి తరలివచ్చే ఏపీ ఉద్యోగులకు సోమవారం ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఆయా శాఖల అధికారులతోపాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉద్యోగులు, ఫైళ్లు, ఫర్నిచర్ తరలిపోవడంతో హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం బోసిపోయింది. ఉద్యోగులకు ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించినప్పటికీ కొందరు ఉద్యోగులు సచివాలయానికి వచ్చారు. అందరూ కలిసి తమ అనుభూతులను పంచుకున్నారు. కొందరు కంటతడి పెట్టుకున్నారు. ఫొటోలు దిగి బరువెక్కిన గుండెలతో వెనుదిరిగారు.