: నవాజ్ షరీఫ్ కు మరో తలనొప్పి... ఎలక్షన్ కమీషన్ కు అనర్హత పిటిషన్!
భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రయిక్స్ తో ఇప్పటికే ఇంటా బయటా పరువుపోయి, మింగలేక కక్కలేక ఇబ్బందిపడుతున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఇప్పుడు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఈసారి ఆయన పదవికి ఎసరుపడేలా కనిపిస్తోంది. ఆమధ్య వెలుగుచూసిన పనామా పేపర్స్ లో నవాజ్ షరీఫ్ పేరు కూడా రావడంతో, ఆయనను పార్లమెంటు సభ్యుడి పదవికి అనర్హుడిగా ప్రకటించవలసిందిగా కోరుతూ, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని 'తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ) నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దిఖీకి ఆగస్టు 15న ఓ వినతిపత్రాన్ని సమర్పించింది. దీనిని పరిశీలించిన స్పీకర్ ఇప్పుడు తదుపరి చర్యల కోసం దానిని ఈసీపీ (ఎలక్షన్ కమీషన్ ఆఫ్ పాకిస్థాన్)కి పంపినట్టు తెలిపారు. లాహోర్ లో ఈ రోజు స్పీకర్ సిద్ధిఖీ మాట్లాడుతూ, పీటీఐ రిఫరెన్స్ లను చూసిన తరువాత పార్లమెంటును మరింత దృఢతరం చేయాలని భావించానని, అందుకే దానిని ఈసీపీకి పంపానని చెప్పారు. దీంతో షరీఫ్ కి కొత్త తలనొప్పి మొదలైందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.