: ముగిసిన నల్లధనం వెల్లడి కార్యక్రమం... వెలుగులోకి రూ.70వేల కోట్ల బ్లాక్ మనీ


నాలుగు నెలల నల్లధనం వెల్లడి కార్యక్రమం ఐడీఎస్ నిన్నటితో ముగిసింది. ఆదాయపన్ను లెక్కల్లో చూపకుండా పోగేసిన అక్రమాస్తుల వివరాలను స్వచ్చందంగా వెల్లడించి, ఆ ఆస్తుల విలువపై 45 శాతం పన్ను చెల్లించడం ద్వారా దాన్ని సక్రమంగా మార్చుకునేందుకు, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు మోదీ సర్కారు ఓ అవకాశం ఇచ్చింది. ఇందుకోసం ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్)ను నాలుగు నెలల క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ 30వరకు పౌరులు స్వచ్చందంగా తమ అప్రకటిత ఆస్తుల వివరాలను తెలియజేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ స్వయంగా పిలుపునిచ్చారు. లేకుంటే గడవు తర్వాత లెక్కల్లో చూపని ఆస్తులు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పథకం గడువు నిన్నటితో ముగిసింది. ఢిల్లీలోని సెక్రటేరియట్ నార్త్ బ్లాక్ లో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో శుక్రవారం రాత్రంతా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. సాధారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఈ కార్యాలయంలో ఎవరూ కనిపించరు. కానీ ఐడీఎస్ పథకం ముగియడంతో నల్లధనానికి సంబంధించి ఎంత విలువ మేర ఆస్తుల వివరాలు వచ్చాయన్నది తేల్చేందుకు అధికారులు, సిబ్బంది రాత్రంతా ఇళ్లకు వెళ్లకుండా పరిశీలన చేపట్టారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐడీఎస్ పథకం కింద వచ్చిన స్పందనను మీడియా సమావేశంలో తెలియజేయనున్నారు. ఆ లోపు సమగ్ర వివరాలను సిద్ధం చేసేందుకు అధికారులు రిటర్నులను పరిశీలిస్తున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు ప్రాథమికంగా సుమారు రూ.70వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వివరాలను నల్లకుబేరులు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీనిపై 45 శాతం పన్ను అంటే కేంద్ర ప్రభుత్వానికి రూ.31,500 కోట్ల ఆదాయం సమకూరనుంది. చివరిగా 1997లో చిదంబరం ఆర్థిక మంత్రిగా దేవెగౌడ సర్కారు హాయంలో స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకాన్ని చేపట్టారు. అప్పట్లో రూ.33,000 కోట్ల అక్రమాస్తుల వివరాలు వెలుగు చూశాయి. ఆ తర్వాత మోదీ సర్కారు గతేడాది విదేశాల్లోని నల్లధనం ఆస్తుల వివరాల వెల్లడికి అవకాశం ఇచ్చింది. అప్పుడు రూ.4,164 కోట్ల ఆస్తుల వివరాలు బయటపడ్డాయి. వీటితో పోలిస్తే తాజాగా ఐడీఎస్ పథకం కింద వెలుగు చూసిన నల్లధనం ఆస్తుల వివరాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News