: పోలవరం ప్రారంభమైందిగా.. మా నీళ్లు మాకిస్తే మంచిది: సుప్రీంలో కర్ణాటక, మహారాష్ట్ర రిట్లు


పోలవరం నిర్మాణం ప్రారంభమైంది కాబట్టి బచావత్ అవార్డు పేర్కొన్నట్టు తమ వాటా నీరు తమకు ఇవ్వాల్సిందేనంటూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేశాయి. పోలవరం నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలంటూ ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించి సంగతి తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక కూడా పిటిషన్లు వేశాయి. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన వెంటనే కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీల వాటా లభిస్తుందని, కృష్ణానది నీటిని ఆయా రాష్ట్రాలు వాడుకోవచ్చని బచావత్ ట్రైబ్యునల్‌లో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా మహారాష్ట్ర, కర్ణాటక తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినందున తమ వాటా జలాలను తాము వాడుకునేలా అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. మరోవైపు ఒడిశా తరపు నుంచి వాదనలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది పోలవరం నిర్మాణం వల్ల తమ రాష్ట్రంలోని పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో కేంద్ర అటవీ పర్యావరణశాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖతోపాటు తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లను కూడా కక్షిదారులుగా చేర్చాలని కోర్టును కోరారు. అయితే పోలవరం విషయంలో తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లకు ఎటువంటి సంబంధం లేదని వారిని కక్షిదారులుగా చేర్చవద్దని ఏపీ తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం తమ వైఖరి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను శీతాకాల సెలవుల అనంతరం చేపడతామంటూ కేసును వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News