: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన క్రికెట్ మైదానం ఏదో తెలుసా?
క్రికెట్ విషయానికొచ్చే సరికి భారతీయ అభిమానులు గర్వించాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో భారత్ మొదటి రెండు మూడు స్థానాల్లో ఎప్పుడూ ఉంటుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో క్రికెట్ మైదానం కూడా మన దేశంలోనే ఉంది. పైగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలోనూ చోటు సంపాదించుకుంది. ఈ క్రికెట్ స్టేడియాన్ని చూడాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. సిమ్లాకు 45 కిలోమీటర్ల దూరంలో చెయిల్ అనే పర్వత ప్రాంతం ఉంది. అక్కడే ఈ క్రికెట్ మైదానం సముద్ర మట్టానికి 2,144 మీటర్లు (సుమారు 7వేల అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ స్టేడియం పేరు ధర్మశాల. పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ 1893లోనే దీన్ని ఏర్పాటు చేయించారు. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు ఆయన ఈ స్టేడియం ఏర్పాటు చేయించారట. ప్రస్తుతం ఈ స్టేడియం ఆర్మీ నిర్వహణలో ఉంది. చుట్టూ పర్వతాలు, అటవీ ప్రాంతం, పచ్చదనంతో ఈ స్టేడియం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ స్టేడియంకు ఓ వైపున మిలటరీ స్కూల్ ను కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు, రైలు, విమాన మార్గంలో ఈ స్డేడియాన్ని చేరుకోవచ్చు. క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ పేజీలో ఈ స్టేడియం ఫొటోను ఉంచడం విశేషం.