: మునిసిపల్ ఎన్నికల అనంతరం ఐదుగురు ఏపీ మంత్రులపై వేటు.. ఆ మంత్రులు ఎవరు?


మునిపల్ ఎన్నికల అనంతరం ఐదుగురు ఏపీ మంత్రులపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే, ఆ ఐదుగురు మంత్రులు ఎవరన్న దానిపై రాష్ట్రంలోనూ, మంత్రుల మధ్య ఒకటే చర్చ నడుస్తోంది. ఈ ప్రచారంతో ఆ ఐదుగురు మంత్రుల గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే. విజయదశమికి విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. అయితే మునిసిపల్ ఎన్నికలు ఉండడంతో విస్తరణ జనవరికి వాయిదా పడింది. ఏపీలో ఆరు కార్పొరేషన్లు, ఐదు పురుపాలక సంఘాలకు ఎన్నికల జరగనున్నాయి. రెండున్నరేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికలు, మునిసిపల్, పంచాయతీ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ప్రజల నాడిని చాటిచెప్పే ఎన్నికలు జరగలేదు. త్వరలో రానున్న ఎన్నికల్లో పట్టు సాధించి పైచేయి సాధించాలని ఇటు టీడీపీ, అటు వైసీపీలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేసిన చంద్రబాబు ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో వెనకబడిన వారికి ఉద్వాసన తప్పదంటూ సీఎం చంద్రబాబు బాహాటంగానే పేర్కొన్నారు. దీంతో ఉద్వాసన తప్పదన భావిస్తున్న ఆ ఐదుగురు మంత్రుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో ఆయన సహా 20 మంది ఉన్నారు. మరో ఐదుగురికి అవకాశం ఉంది. ఇప్పుడు అనుకుంటున్నట్టు ఐదుగురిని తప్పిస్తే మొత్తం పదిమంది కొత్తవారికి అవకాశం లభిస్తుంది. దీంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరికి అవకాశం ఇస్తారో తెలియని టీడీపీ శ్రేణులు లెక్కల్లో మునిగిపోయాయి. కాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఏంటంటూ ఇప్పటికే తెలంగాణలో టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేతలే చెబుతున్నారు. మరోవైపు తరచూ వివాదాల్లో ఉంటున్న ఓ మంత్రి సహా గతంలో ఆరోపణలు వెల్లువెత్తిన ఓ మహిళా మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. వీరితోపాటు మరో ముగ్గురి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీంతో విషయం తెలిసిన ఆ మంత్రులు ఇప్పటినుంచే ‘కాగల’ పనులను చక్కబెట్టుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం కూడికలు, తీసివేతల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు.

  • Loading...

More Telugu News