: పాక్ తో విమాన సంబంధాల తెగతెంపులపై కేంద్రం సమాలోచన


పాకిస్తాన్ పై ముప్పేట దాడి వ్యూహాలకు కేంద్ర సర్కారు పదును పెడుతోంది. యూరీ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇప్పటికే ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ తీరును భారత్ ఎండగట్టింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేసే వ్యూహాల్లో ఉంది. మరోవైపు పాకిస్తాన్ కు జీవనాధారమైన సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టే ఆలోచనల్లో ఉంది. గరిష్టంగా నీటిని వాడుకోవడం ద్వారా పాక్ ను ఇబ్బంది పెట్టాలని నిర్ణయించింది. పాకిస్తాన్ కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశం హోదాను కూడా రద్దు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వీటికితోడు పాకిస్తాన్ తో గగనతల సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని భావిస్తోంది. భారత్ నుంచి పాకిస్తాన్ కు నేరుగా విమానాల రాకపోకలతోపాటు ఒక దేశం విమానాలు మరో దేశ గగనతలం గుండా ప్రయాణించే అవకాశాన్ని కూడా రద్దు చేసుకోవాలనుకుంటోంది. వాస్తవానికి మన దేశం నుంచి ఏ విమానయాన సంస్థ కూడా పాకిస్తాన్ కు సర్వీసులు నిర్వహించడం లేదు. కానీ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ మాత్రం వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ఢిల్లీ-కరాచీ మధ్య ఒకటి, ముంబై-లాహోర్, ఢిల్లీ-లాహోర్ మధ్య రెండు సర్వీసుల చొప్పున నిర్వహిస్తోంది. అయితే, ఇరు దేశాల గగనతలంపై మరో దేశానికి చెందిన విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే భారత్ నుంచి గల్ఫ్ కు, యూరోప్, నార్త్ అమెరికాకు వెళ్లే విమానాలు పాక్ మీదుగా వెళుతున్నాయి. అదే సమయంలో ఆగ్నేయాసియా, బంగ్లాదేశ్ లకు భారత గగనతలంపై నుంచే పాక్ విమానాలు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని విమానయాన శాఖను ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. దీనిపై ప్రధాని ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గగనతల సంబంధాలు తెంచుకుంటే దేశీయ విమానాలు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల వ్యయం పెరిగి వాటికి కష్టాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు అవకాశం తక్కువేనని విశ్లేషకుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News