: మల్లన్న సాగర్ పంచాయితీ కూడా పూర్తయింది.. ఇక నెత్తిమీదనే సముద్రం!: కేసీఆర్
తాము తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కష్టపడుతున్నామని, దీనికి దేవుడు కూడా కరుణిస్తున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట ప్రజలతో బుధవారం ఎర్రవల్లిలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నిన్నమొన్నటి వరకు మల్లన్న సాగర్ పంచాయితీ ఉండే. గా పంచాయితీ కూడా పూర్తయినట్టే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తయితే నెత్తిమీద సముద్రం ఉన్నట్టే. నిన్నమొన్న కురిసిన వానలకు చెరువులు నిండినయ్. నేను మీకు చెప్పకుండనే వచ్చి ఈడనే, ఈ ఫాం హౌస్‌లోనే ఉన్న. చెరువులను చూసి పోయిన. కూడవెళ్లి వాగు వరద పోతుంటే పానమంతా సంబురమైంది. వారం రోజులుగా వానలు దంచికొట్టినయ్. ఇక వర్షాలు ఎప్పుడు పడతయో అని ఎదురుచూడాల్సిన పనిలే’’ అన్నారు. వ్యవసాయంలో ప్రతి ఒక్కరు నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ‘అందరి కోసం అందరు’ అనే నినాదంతో పనిచేయాలని అన్నారు. దత్తత గ్రామాల్లో ప్రతి ఇంటికి రెండు గేదెలు, పది కోళ్లు ఇస్తామని, గేదెలను మీరే ఎంపిక చేసుకుని బయానా ఇచ్చి రావాలని కేసీఆర్ సూచించారు. దత్తత గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేసుకుందామని ముఖ్యమంత్రి అన్నారు.