: అత్యాధునిక రైఫిల్స్ కొనుగోలుకు ‘కేంద్రం’ గ్రీన్ సిగ్నల్


భారత సైన్యం చేతికి త్వరలో అత్యాధునిక తుపాకులు అందనున్నాయి. ప్రపంచ దేశాల్లోని అత్యుత్తమ ఆయుధ తయారీ కంపెనీల నుంచి రెండు లక్షల అత్యాధునిక తుపాకులను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ (ఆర్ఎఫ్ఐ)ని భారత రక్షణ శాఖ నిన్న విడుదల చేసింది. ఈ మెగా ప్రాజెక్టు కింద దాదాపు రూ.1200 కోట్ల విలువైన అత్యాధునిక రైఫిల్స్ ను కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన టెక్నో కమర్షియల్ బిడ్లు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని రక్షణ శాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ టెండర్లలో అమెరికాకు చెందిన కోల్ట్, ఇటలీ కి చెందిన బెరెట్టా, యూరప్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్ సౌర్, చెక్ రిపబ్లిక్ కు చెందిన సెస్కా, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర ఆయుధ కంపెనీలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. కొనుగోలు చేయనున్న కొత్త ఆయుధాలన్నీ 7.62x51 ఎంఎం అసల్ట్ రైఫిల్స్ రకాలేనని, ప్రస్తుతం భారత సైన్యం వినియోగిస్తున్న 5.56 ఎంఎం రైఫిళ్ల స్థానే కొత్త వాటిని ప్రవేశపెడతామని ఆర్ఎఫ్ఐ లో పేర్కొంది. 500 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం కొట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే ఈ ప్రతిపాదిత ఆయుధాల బరువు తక్కువగానే ఉంటుందని, సైనికులు వినియోగించడానికి సౌకర్యంగా ఉంటుందని, కొనుగోలు చేయనున్న కొత్త రైఫిల్స్ కు మల్టీ ఆప్షన్ టెలిస్కోప్ తో పాటు, 40 ఎంఎం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ ను బిగించుకునే వీలుంటుందని, విజుబుల్ లేజర్ టార్గెట్ పాయింటర్, హాలో గ్రాఫిక్ సైట్ మొదలైన సౌకర్యాలు ఉంటాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News