: రైల్వే సిబ్బందికి దసరా కానుక.. 78 రోజుల బోనస్ ఇచ్చేందుకు ఆమోదం
దసరా పండగ కానుక కింద రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్ అందనుంది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్ (పీఎల్ బీ)ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. దసరా పండగ ముందే ఉద్యోగులకు బోనస్ అందిస్తామని చెప్పారు. కాగా, గత ఏడాది వరకు పీఎల్ బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో ఈ ఏడాదిలో ఉద్యోగులు అందుకోనున్న బోనస్ కూడా బాగానే పెరిగింది. ప్రతి ఉద్యోగికి దాదాపు రూ.18 వేల చొప్పున బోనస్ లభించనుంది. ఈ బోనస్ ద్వారా దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే, ఉద్యోగులకు ఈసారి ఇవ్వనున్న బోనస్ తో రైల్వేపై దాదాపు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడనుంది.