: చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఇంత‌పెద్ద ప్రాజెక్టు ఎక్కడా క‌ట్ట‌లేదు: ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు


నీటి భద్ర‌తపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్రత్యేక దృష్టి సారించింద‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విజ‌య‌వాడ‌లో రెండు రోజుల క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగించారు. స్మార్ట్ వాట‌ర్ గ్రిడ్ ఏర్పాటు చేయాల‌న్న‌ది త‌న‌ ల‌క్ష్యమ‌ని పేర్కొన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల రాష్ట్రానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు. దేశ‌ చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఇంత‌పెద్ద ప్రాజెక్టు ఎక్క‌డా క‌ట్ట‌లేదని చ‌ంద్ర‌బాబు అన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టుని ప్ర‌తివారం తాను స‌మీక్షిస్తున్న‌ట్లు తెలిపారు. 2018లోపు పోల‌వ‌రం పూర్త‌వుతుందని చెప్పారు. భ‌విష్య‌త్తులో రాష్ట్రంలో క‌ర‌వు అనే ప‌రిస్థితి ఉండ‌బోదని చంద్ర‌బాబు తెలిపారు. గోదావ‌రి, కృష్ణా, పెన్నా న‌దుల‌ను అనుసంధానం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు. స‌వాళ్ల‌ను ఎదుర్కుంటూనే ముందుకు వెళుతున్నామ‌ని చెప్పారు. రాజ‌ధాని లేక‌పోవ‌డం, వ‌న‌రుల లేమి స‌మ‌స్య‌లు ఉన్నాయని, అయినా అన్ని పరిస్థితుల‌ను అధిగ‌మిస్తున్నామ‌ని చెప్పారు. ‘ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే జీఎస్ డీపీలో మ‌న‌మే ముందున్నాం.. మొద‌టి త్రైమాసికంలో 12 శాతం వృద్ధి సాధించాం.... జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధి రేటు ఎక్కువ‌... సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో ఉప‌యోగిస్తున్నాం... సుస్థిర అభివృద్ధి సాధించాలంటే భ‌ద్ర‌త ముఖ్యం’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌జా సంక్షేమం కోసం పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని వాటిని స‌మ‌ర్థంగా ముందుకుతీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు అధికారుల‌కు సూచించారు. 43 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఎవ్వ‌రికీ ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈ కార్య‌క్ర‌మం ముందుకు సాగాల‌ని కోరారు. ఒక్క ఏడాదిలో ప‌ట్టిసీమ పూర్తి చేశామ‌ని తెలిపారు. ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర్షాల‌కు జ‌లాశ‌యాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయని తెలిపారు. అన్ని కార్య‌క్ర‌మాలను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌కృతి విప‌త్తులను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని అన్నారు.

  • Loading...

More Telugu News