: పంజాబ్ లో బేరాలు మొదలు పెట్టిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ... లాగేయాలని చూస్తున్న కాంగ్రెస్!
తమది పొలిటికల్ పార్టీ కాదని చెబుతూ పంజాబ్ గడ్డపై 'ఆవాజ్-ఇ- పంజాబ్'ను స్థాపించి, ఆపై ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను తమవైపు లాగేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సిద్ధూ నుంచి ఎన్నికల్లో పోటీ సంకేతాలు రావడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. తమ అజెండాతో ఆయన లక్ష్యాలు సరిపోతే, పొత్తుకు సరేనంది. ప్రస్తుతానికి ఆవాజ్ ఇ పంజాబ్ నేతలెవరూ తమతో చర్చించడం లేదని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. వారి సీఎంపీ (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్)ని తమకు పంపితే, దాన్ని పరిశీలించిన తరువాత పొత్తు అంశాన్ని పరిశీలిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. వారి ప్రణాళిక తమ మ్యానిఫెస్టోకు దగ్గరగా ఉంటే స్వాగతిస్తామని చెప్పారు. ఇక ఇదే విషయమై ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కన్వీనర్ గురుప్రీత్ సింగ్ స్పందిస్తూ, "ఆవాజ్ ఇ పంజాబ్ నేతలు బేరసారాలు మొదలు పెట్టారు. ఈ విషయం మాకు ముందే తెలుసు. రెండు పెద్ద పార్టీలతో వారు మాట్లాడుతున్నారు. బెస్ట్ డీల్ కోసం చూస్తున్నారు" అని అన్నారు.