: హిందూ పునర్వివాహ చట్టాన్ని ఆమోదించిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ
హిందూ పునర్వివాహ బిల్లును ఆమోదిస్తూ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా హిందువుల పునర్వివాహంలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. దీని ప్రకారం భర్త చనిపోయిన ఆరు నెలల తరువాత హిందూ మహిళలు పునర్వివాహం చేసుకోవచ్చు. అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా పునర్వివాహం చేసుకోవచ్చు. ఈ బిల్లులోని ఓ క్లాజ్ మత మార్పిడిని ప్రోత్సహిస్తోందంటూ ఓ హిందూ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేయడంపై స్పందించిన మానవ హక్కుల మంత్రి కామ్రాన్ మైఖేల్ మాట్లాడుతూ, సభ్యుడు ఈ క్లాజును తప్పుగా అర్థం చేసుకున్నాడని వివరణ ఇచ్చారు. దీంతో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు ప్రకటించారు. ఇది పాకిస్థాన్ ఎగువ సభకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది.