: ఆనాడు రాజ్యసభలో చూస్తూ ఊరుకోలేకపోయాను: వెంకయ్య నాయుడు
రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పట్ల ఆనాడు రాజ్యసభలో చూస్తూ ఊరుకోలేకపోయానని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చినందుకుగానూ ఆయనకు గుంటూరులోని తెనాలిలో సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనను ఆరోజు హోదా అడిగారు అంటూ విమర్శిస్తున్నారని, అసలు హోదా అడగడంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ విడిపోతే రాష్ట్రానికి ఏం కావాలో అన్నీ అడగాలని తాను కాంగ్రెస్ నేతలకి చెప్పినట్లు పేర్కొన్నారు. కానీ వారు వినలేదని చెప్పారు. అందరినీ మోసం చేసి పార్లమెంటులో విభజన బిల్లు పెట్టారని చెప్పారు. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదని చెప్పారు. ‘లోక్ సభలో ఎవరు మాట్లాడినా వారిని బయటకు పంపేశారు. దూరదర్శన్ లైవ్ ఆపేశారు.. ఎవరినీ మాట్లాడనివ్వకుండా చేశారు. 23 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు. బిల్లు రాజ్యసభకి వచ్చేసరికి చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను రాష్ట్రానికి హోదా కావాలని మాట్లాడాను. మొదటి సారిగా అద్వానీ దగ్గర కూడా గట్టిగా మాట్లాడాను.. రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనన్నాను. అందరు నేతలలో మాట్లాడాను. చట్టంలో ఎన్నో విషయాలు పొందపర్చాలని కోరా. ఏపీకి న్యాయం జరిగే వరకు ఎంతవరకయినా వెళతా.. హోదా మాత్రమే కాదు, ఎన్నో అంశాలు అడిగా. అందులో అనుమానం ఏముంది..? పోలవరం ప్రాజెక్టు కడితే ముంపు గ్రామాలు మునిగిపోతాయని చెప్పాను. విభజన బిల్లులో రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే పలు అంశాలు పెట్టలేదు. బిల్లులో ప్రత్యేక హోదా ఉందా..? లేదు... ఎందుకు పెట్టలేదు?’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.