: ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకున్న ఎమ్మెల్యేకు కేసీఆర్ క్లాస్
మియాపూర్ సమీపంలోని దీప్తి శ్రీనగర్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ సిబ్బందిని ఎమ్మెల్యే వివేకానంద అడ్డుకోవడంపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణం అక్రమమని తేల్చిన తరువాత, వాటి కూల్చివేతకు వస్తే, అడ్డుకోవడం ఏంటని క్లాస్ పీకారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గ్రేటర్ ఎమ్మెల్యేలు చెయ్యి పెడితే సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు పక్కా ఆధారాలతో కూల్చివేతలకు వెళుతున్నారు. ఎవరైనా ప్రజా ప్రతినిధులు అడ్డు పడితే, వారికి తమ వద్ద ఉన్న సాక్ష్యాలు చూపుతున్నారు. మొదటి దశలో నాలాలపై ఉన్న నిర్మాణాల కూల్చివేతలకు వెళుతున్న అధికారులు, ఎవరు అడ్డుకున్నా వెంటనే మునిసిపల్ మంత్రి దృష్టికి తీసుకువెళుతుండటంతో, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన నిలిచేందుకు జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నాలాలపై నిర్మాణాలను తొలగించిన తరువాత, మిగతా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కట్టిన అన్ని భవనాలనూ కూల్చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా బాలాజీనగర్, భగత్ సింగ్ నగర్, ఆరాంఘర్ చౌరస్తా, ఆల్వాల్, సుభాష్ నగర్, బేగంపేట పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు అధికంగా ఉన్నాయని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.