: హైదరాబాదులో నిలిచిపోయిన కేబుల్ ప్రసారాలు


గ్రేటర్ హైదరాబాదులో డిజిటల్ కేబుల్ టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. దీంతో అనలాగ్ పద్ధతిలో కొనసాగుతున్న ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో గత మూడు రోజుల నుంచి సెట్‌ టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌ టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరి చేస్తూ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌ లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. దీనికి నాలుగు విడతలుగా గడువు కూడా విధించింది. న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో కేబుల్ టీవీల్లో అనలాగ్, డిజిటల్ పద్ధతుల్లో ప్రసారాలకు వెసులుబాటు కల్పించింది. పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ప్రక్రియ అమలులో భాగంగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్‌ఎస్‌ఓ) కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేబుల్ టీవీలకు అనలాగ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోగా, డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందుతున్నాయి. హైదరాబాదులో మొత్తం టీవీ కనెక్షన్లల్లో 80 శాతం వరకు డీటీహెచ్ కనెక్షన్లు ఉండగా, మిగిలిన 20 శాతం కేబుల్ కనెక్షన్లు అనలాగ్ పధ్ధతిలో ప్రసారాలు అందుతున్నాయి. సిటీ కేబుల్, హాత్‌ వే, డిజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్ధలు తమ ఆపరేటర్ల ద్వారా సుమారు 20 లక్షల వరకు సెట్‌ టాప్ బాక్స్‌ లు విక్రయించినట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం 20 శాతం వరకు కేబుల్ టీవీలకు సెట్‌ టాప్ బాక్స్‌ లు లేనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News