: స్టాక్ మార్కెట్ పై ట్రంప్ ప్రభావం... భారీ నష్టాలు!


అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ లు తొలిసారిగా ముఖాముఖి వాదనకు తలపడనుండటం, ట్రంప్ గెలుస్తారని వస్తున్న విశ్లేషణలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను కుంగదీయగా, స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో మునిగిపోయింది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు బలహీనంగా ఉండటం, యూరప్ మార్కెట్లూ నష్టాల్లో ప్రారంభం కావడంతో ఏ దశలోనూ బెంచ్ మార్క్ సూచికలు కోలుకునే పరిస్థితి కనిపించలేదు. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగియనుండటం కూడా నూతన కొనుగోళ్లను దూరం చేసిందని నిపుణులు వ్యాఖ్యానించారు. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే, 120 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ఆపై మరింతగా దిగజారి వచ్చింది. పెద్ద కంపెనీలతో పోలిస్తే, చిన్న కంపెనీలు తక్కువ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 373.94 పాయింట్లు పడిపోయి 1.30 శాతం నష్టంతో 28,294.28 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 108.50 పాయింట్లు పడిపోయి 1.23 శాతం నష్టంతో 8,723.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.53 శాతం, స్మాల్ కాప్ 0.55 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 8 కంపెనీలు లాభపడ్డాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, జడ్ఈఈఎల్, ల్యూపిన్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐడియా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,909 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,039 కంపెనీలు లాభాలను, 1,655 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,11,47,282 కోట్లకు తగ్గింది.

  • Loading...

More Telugu News