: విహంగ వీక్షణం.. మధ్యమానేరును పరిశీలించడానికి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం కేసీఆర్
ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి మధ్య మానేరును పరిశీలించడానికి హెలికాప్టర్‌లో బయలుదేరారు. అంతకు ముందు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులతో చర్చించారు. మధ్య మానేరు నిర్మాణంలో జరిగిన జాప్యం వల్లే జిల్లాలో కురిసిన వరదలతో తీవ్రనష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. ఎగువ మానేరు నుంచి భారీస్థాయి వరద వచ్చిందని చెప్పిన కేసీఆర్.. అందువల్లే మధ్య మానేరుపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. ఇకపై 5శాతం కంటే తక్కువ టెండర్లు వేసిన కాంట్రాక్టర్లను పనులకు అనుమతించకూడదని సూచించారు. వర్షాల వల్ల గోదావరిలో వరద అధికంగా ఉందని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లాలోని రామన్నపేట, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో వర్షాల కారణంగా జరిగిన నష్టంపై అంచనాలు వేసి తమకు నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు.