: రూ.10 నాణెం తీసుకునేందుకు నిరాకరిస్తే దేశద్రోహం కేసు!
పది రూపాయల నాణెం.. ఇటీవల ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇది చెల్లుబాటు కాదంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేయడంతో దీనిని తీసుకునేందుకు చాలామంది నిరాకరిస్తున్నారు. వ్యాపారులైతే దానినో భూతంలా చూస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం పది రూపాయల నాణెం చెల్లుతుందని, తీసుకునేందుకు నిరాకరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయినా ప్రజల్లో భయం మాత్రం పోలేదు. మన సంగతి అలా ఉంచితే ఉత్తరప్రదేశ్‌లోనూ ఈ నాణెంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది చెల్లదంటూ ‘వాట్సాప్’లో మెసేజ్‌లు వెల్లువెత్తాయి. దీంతో వ్యాపారులు దీనిని ముట్టుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో స్పందించిన ప్రభుత్వం పది రూపాయల నాణేన్ని తీసుకునేందుకు నిరాకరించిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఫిల్ బిత్ జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం హెచ్చరికలు జారీ చేశారు. రూ.10 నాణెం దేశ కరెన్సీ అని, దీనిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ నాణెం విలువకు సమాన మొత్తం ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కాయిన్‌ను తిరస్కరించే వారిపై దేశద్రోహం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా యూపీలో గత రెండుమూడు నెలలుగా ఈ కాయిన్‌పై అవాస్తవ ప్రచారాలు ఎక్కువయ్యాయి. అది చెల్లుబాటు అవదంటూ వార్తలు రావడంతో ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది.